ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారని.. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉండదని చెప్పి.. ఇప్పుడు పెంచారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 27న పోరుబాట నిరసన కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు చంద్రబాబు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను చాలా కష్టాలకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందన్నారు. ఆనాడు విద్యుత్ చార్జీలతో నలిగిపోతున్న ప్రజలకు, రైతులకు అండగా స్వర్గీయ వైయస్ఆర్ పెద్ద ఎత్తున ఉద్యమించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసేందుకు ఏకంగా రైతులపై పోలీసులతో కాల్పులు చేయించి, రక్తపాతానికి కారణమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు వల్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయలేక ప్రజల నడ్డి విరుగుతోందన్నారు. ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ ఈనెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలరన్నారు.