జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ కొట్టడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద లారీ యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో తిరుపతి వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో 40 మంది ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.