చిత్తూరులో సినిమా స్టైల్‌లో జరిగిన గాంధీ రోడ్డు దొంగల ముఠా కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మెుత్తం ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు వెల్లడించారు. వీరు గాంధీ రోడ్డులో ఉండే వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు యత్నించారని ఆయన అన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, మూడు డమ్మీ తుపాకులు, 2 కత్తులు, కారంపొడి, గమేక్షన్ పొడి, 4 బుల్లెట్లు, కొన్ని పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దోపిడీ మెుత్తానికి స్కెచ్ వేసింది చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యమని.. ఈయనకు మరో ఆరుగురు సాయం చేశారని ఎస్పీ తెలిపారు.నిందితులు చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరి పట్టణానికి చెందిన ఎస్ ఇబ్రహీం, నంద్యాల జిల్లాకు చెందిన నవీన్ కుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు, రాజశేఖర్, నెట్టి కంటయ్య, సంపత్ కుమార్‌గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యంపై కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఆరు కేసులు ఉన్నాయని... దొంగతనం, రాబరీ, హత్య కేసుల్లో 10 సంవత్సరాలు శిక్ష అనుభవించిన సుబ్రహ్మణ్యం.. 15 సంవత్సరాల నుంచి చిత్తూరులో SLV ఫర్నీచర్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడని తెలిపారు. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడంతోనే రాబరీకి స్కెచ్ వేసినట్టు పోలీసులు తెలిపారు.