తెలంగాణలో గతంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. లబ్ధిదారులు కేటాయించిన ఇళ్లలోనే నివసిస్తున్నారా? అద్దెకు ఇచ్చారా? అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు 66,127 ఇళ్లను పంపిణీ చేయగా.. మరో 22,120 ఇళ్లను సెప్టెంబరులో అందించేందుకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రాథమికంగా సుమారు 15 వేల మంది కేటాయించిన ఇళ్లలో నివసించడం లేదని గుర్తించిన అధికారులు కారణాలను తెలుసుకుంటున్నారు. అవసరమైతే ముందుగా నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.