గత కొంతకాలంగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తిరుపతి వాసులకు వరుణుడు ఊరటనిచ్చాడు. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమవ్వడమే కాకుండా.. ఏడుకొండల చెంత రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి మాల్వాడిగుండం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. పాలధారలా పొంగిపొర్లుతున్న మాల్వాడిగుండంతో పాటు కపిలతీర్థం జలపాతం వద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. కొండలపై నుంచి ఎగిసిపడుతున్న ఈ జలపాతాల అందాలు శ్రీవారి భక్తులను, స్థానిక నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వర్షాల వల్ల తిరుపతి నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాలు వేగంగా నిండుతున్నాయి.