తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి శుక్రవారం ఘనంగా జరిగింది. కుమారధార తీర్థ ముక్కోటికి వచ్చే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు శ్రీవారి సేవకుల సహకారంతో పాలు, కాఫీ, ఉప్మా, పొంగలితో పాటుగా సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, మజ్జిగ, తాగునీరు అందించారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, అటవీ సిబ్బంది పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా కుమారధార తీర్థముక్కోటిని నిర్వహిస్తారు. ఆ రోజున కుమారధార తీర్థాన్ని దర్శించి, స్నానమాచరిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.పురాణాల ప్రకారం శేషాచలం కొండల్లో ఒక వృద్ద బ్రాహ్మణుడు ఒంటరిగా సంచరిస్తుండేవాడు. అయితే శ్రీవారి ఒకరోజు ప్రత్యక్షమై.. ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏం చేస్తున్నావని ఆ వృద్ధ బ్రాహ్మణుడిని ప్రశ్నించారటం. యజ్ఞం, యాగాలు చేసి దైవరుణం తీర్చుకోవాలనేదే తన కోరిక అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడు స్వామికి బదులిచ్చాడట. అనంతరం శ్రీవారి సూచనతో ఆ వృద్ధుడు ఈ తీర్థంలో స్నానమాచరించగా.. 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ రకంగా ఆ వృద్ధుడు ముసలితనం పోయి కౌమార్యంలోకి మారిపోవడంతో ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చినట్లు చెప్తుంటారు. అలాగే కుమారస్వామి.. తారకాసురుణ్ని సంహరించిన తర్వాత.. ఈ తీర్థంలో స్నానమాచరించారని.. అందుకే ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడిందని మరో వాదన ఉంది.