కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడా, తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్‌లను సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం తిరుపతిలో అరెస్టు చేశారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో నిందితులను అడిషనల్ మున్సిఫ్ కోర్టు జడ్జి నివాసంలో ప్రవేశపెట్టగా వారికి 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు.