తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఫిబ్రవరి నాలుగో తేదీ మంగళవారం అత్యంత వైభవంగా జరగనున్నాయి. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో ఏ ఉత్సవం జరిగినా ఏ ఊరేగింపు జరిగినా అది వైభవోపేతమే. అలాగే సూర్య భగవానుడి పుట్టినరోజైన రథసప్తమి నాడు ఆ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యే వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీ మలయప్ప స్వామి అవతారంలో వెంకన్న భక్తులకు దర్శనమిస్తారు. గంట వ్యవధి తీసుకుంటూ రధసప్తమి నాడు సప్త వాహనాలపై దేవేరులతో కలిసి దేవదేవుడు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వైభవోపేతంగా జరిగే రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. వేకువజామున ఐదున్నర గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామి వారు భక్తుల మధ్యనే ఉండి దర్శన భాగ్యం ఇస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.