తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ అని తెలిపిన జగదీష్ రెడ్డి.. నీళ్లలో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు. తెలంగాణపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస సోయి లేదని విమర్శించారు. కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతుందని.. అడ్డుకోవాలని హరీశ్ రావు సలహా ఇచ్చారన్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు మించి ఏపీ నీళ్లు తీసుకెళ్తుందని చెప్పారు. నీటి విషయంలో మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలపై మాట్లాడటం మానేసి కేంద్రం, చంద్రబాబును ప్రశ్నించాలని జగదీష్ రెడ్డి సూచించారు.