రైతులు ఒకే పంటను పదేపదే వేయటం వల్ల భూసారం తగ్గి దిగుబడులు తగ్గుతున్నాయి. పోషకాల లోపం, తెగుళ్ల బెడద పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా.. వానాకాలం సీజన్‌కు ముందు రైతులు భూసార, నీటి పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనివల్ల భూమిలోని సూక్ష్మ, స్థూల పోషకాల స్థాయి, pH, లవణ సూచిక వంటి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. ఈ సమాచారంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట పంటలతో భూమిని సారవంతం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ పరీక్షలు తప్పనిసరి అని అధికారులు అంటున్నారు.