ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా పేరుతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని.. ఆయనపై కేసు పెట్టాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై లేనిపోని కేసులు పెడుతున్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు పెడతారా అని సవాల్ విసిరారు. చట్టం అందరికీ సమానమైనది నిజమే అయితే, చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే.. ట్రాఫిక్ జామ్ చేసినందుకు గాను చట్టానికి, రాజ్యాంగానికి లోబడి సీఎంపై సీపీ సీవీ ఆనంద్ కేసు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రితో పాటు ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలందరి పైనా కేసు నమోదు చేయాలని సవాల్ చేశారు. అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘సుద్దులు మాకు చెప్పడం కాదు, వారి సహచర మంత్రికి కూడా చెప్పాలి’ అని అసెంబ్లీలో హరీష్ రావు అన్నారు. కొంత మంది సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.