ఏ ఎమ్మెల్యే అయినా ఎలాంటి అనుమతి తీసుకోకుండా అసెంబ్లీకి వరుసగా 60 రోజుల పాటు హాజరుకాకపోతే అనర్హతకు గురవుతారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. జగన్ అయినా.. మరే ఎమ్మెల్యే అయినా.. సహేతుక కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైతే వారు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని రఘురామ స్పష్టం చేశారు.మొత్తం సభ్యుల్లో 10శాతం బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న సంప్రదాయాన్ని 1952 నుంచి అనుసరిస్తున్నారన్న విషయం జగన్‌కూ తెలుసన్నారు. స్పీకర్ అనుమతి తీసుకోకుండానే వరుసగా శాసనసభకు గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టంలోని నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయని రఘురామ కృష్ణరాజు తెలిపారు. 60 రోజుల వ్యవధిలో సెలవుకు దరఖాస్తు చేస్తే స్పీకర్ పరిశీలిస్తారని... లేకుంటే 60 రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్‌గా ఎమ్మెల్యేగా అనర్హుడవుతారని.. అప్పుడు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే జగన్ సభలోకి రాకపోయినా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లిపోవచ్చు కదా? అని విలేకరుల ప్రశ్నించగా ఆయన అవునని సమాధానమిచ్చారు. అలా చేస్తే తన సీటు నిలబెట్టుకోవడానికి పనికొస్తుందే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు రాను అన్న మాటకు విలువ ఉండదని రఘురామ పేర్కొన్నారు.