హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పేదల ఇళ్లనే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని చెప్పింది. పెద్దల భవనాలనూ కూల్చినప్పుడే భూములను రక్షించినట్లు అవుతుందన్నారు. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ప్రశ్నించింది. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని వ్యాఖ్యనించింది.