కృష్ణాజిల్లా మచిలీపట్నం రాజా సెంటర్‌లోని కర్ణాటక బ్యాంకులో భారీ కుంభకోణం బయటపడింది. అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జి.సోమశేఖరరావు బ్యాంకులో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారు నగల స్థానంలో రోల్డు గోల్డ్ నగలు ఉంచి.. అసలు నగలను కాజేశాడు. ఆ నగలను వేరే బ్యాంకుల్లో పెట్టి లోన్లు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. చాలా కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం బ్యాంకు అధికారుల ఆడిట్‌లో బయటపడింది. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కర్ణాటక బ్యాంకు అధికారులు. అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సోమశేఖరరావు బంగారాన్ని దొంగిలిస్తున్నా... మేనేజర్ శ్రీహరికి తెలియకపోవడంపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆయన స్థానంలో వేరొకరిని ఇన్‌చార్జిగా నియమించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ఆర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సోమశేఖరరావును అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతను విజయవాడలోని వివిధ బ్యాంకుల్లో ఈ బంగారాన్ని తాకట్టుపెట్టాడని పోలీసులు చెబుతున్నారు.