తనకు మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందంటూ స్టార్ సింగర్ మంగ్లీ తన మనసులో మాట బయట పెట్టారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను రెండు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న మంగ్లీ.. తన పాటలతో అందర్నీ ఉత్సాహపరిచారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్న తనకు చెప్పినట్టు శ్రీకాకుళం పుణ్యభూమి అని కొనియాడారు. మళ్లీ జన్మంటూ ఉంటే సిక్కోలులో పుడతాను అంటూ భావోద్వేగానికి గురయ్యింది. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అరసవెల్లి సూర్యనారాయణుని దర్శనం చేసుకున్నానని, ఈ వేడుకల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సూర్యభగవానుడిపై అన్నమయ్య రాసిన కీర్తనను మంగ్లీ ఆలపించారు.