కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చేసిన పని తెలుగు తమ్ముళ్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. అరసవల్లి రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగర్ మంగ్లీ కూడా పాల్గొని తన పాటలతో అందర్నీ ఉత్సాహపరిచారు. అలాగే మంగళవారం ఉదయం రథసప్తమి సందర్భంగా అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని మంగ్లీ దర్శించుకున్నారు. మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దగ్గరుండి మంగ్లీకి వీఐపీ దర్శనం చేయించారు. ఇదే టీడీపీ శ్రేణులకు కోపం తెప్పిస్తోంది. సింగర్ మంగ్లీకి రాచమర్యాదలు కల్పించడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌కు వీరాభిమాని, గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసిన మనిషి, నా నోటి వెంట చంద్రబాబు అనే పేరు పలకనని చెప్పిన మంగ్లీకి టీడీపీ ఎంపీ అయ్యుండి మీరు ఎలా మర్యాదలు చేస్తారని రామ్మోహన్‌నాయుడిని నిలదీస్తున్నారు. వైసీపీ హయాంలో మంగ్లీకి టీటీడీలో పదవి కూడా వచ్చిందని, అలాంటి మహిళకి మీరు మర్యాదలు చేయడమంటే టీడీపీ కార్యకర్తలను అవమానించడమేనని పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై రామ్మోహన్ నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.