ఆదివారం (మార్చి 02న) రోజున వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టటంతో పాటు ఆయా సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే.. పర్యటనలో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి.. తాను విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో 12 ఏళ్ల పాటు ఓ ఇంట్లో అద్దెకుండగా.. ఆ ఇంటిని నేడు సందర్శించారు. తమ ఇంట్లో ఉండి చదువుకున్న పిల్లాడు నేడు సీఎం హోదాలో తమ ఇంటికి రావటం చూసిన ఆ ఇంటి యాజమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆయనను ఘనంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లో చేసిన అల్పాహారాన్ని అప్యాయతతో అందించటంతో.. అంతే ప్రేమతో ఆరగించి వాళ్ల కళ్లలో ఆనందం నింపారు సీఎం రేవంత్ రెడ్డి.