సచివాలయం ముందున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరుగుతున్న తరుణంలోనే ఈ పేరు మార్పు జరిగితే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండలిలో మాట్లాడిన ఆయన.. గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రారంభించలేదని ఈ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించాలని కోరారు. తెలంగాణ మూలాలను కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని అందులో భాగంగా ఈ అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం అద్భుతంగా తెలంగాణ తల్లి పచ్చటి వస్త్రం చూస్తుంటే పంటపొలాల వద్ద గ్రామదేవతలు స్పురణకు వస్తున్నారని, తల్లికి ధరింప చేసిన గుండ్లను చూస్తే మా తల్లిని చూసినట్లుగా ఉందన్నారు.