ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండు పడక గదుల ఇళ్ల కోసం మే 14న నిర్వహించిన లక్కీ డ్రాలో 108 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారికి ఇళ్లు అప్పగించలేదు. మొత్తం 160 ఇళ్లు మంజూరు కాగా.. 108 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 52 ఇళ్ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పూర్తయిన ఇళ్ల వద్ద తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ, ప్రహరీ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కేటాయింపు నిలిచిపోయింది. డ్రాలో పేరు వచ్చినా ఇళ్లు అందకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వసతులు కల్పించి తాళాలు అప్పగించాలని కోరుతున్నారు.