లారీ డ్రైవర్‌పై మదనపల్లె పోలీసుల క్రూరత్వం.. ఏంటయ్యా ఇది!

3 hours ago 1
ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ లారీ డ్రైవర్‌పై అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు క్రూరంగా వ్యవహరించారు. సీఐ ఎదురుగా ఉన్న సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు.. లారీ డ్రైవర్ నహీద్‌ను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో అతని కాలు విరిగినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ, ఇతర పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో జార్ఖండ్ నుంచి తమిళనాడుకు వెళ్తున్న లారీ వచ్చింది. ఈ లారీని పోలీసులు ఆపారు. అయితే ఈ లారీ డ్రైవర్ నహీద్‌కి తెలుగు రాదు. లారీని ఆపిన కానిస్టేబుళ్లు రికార్డులు తీసుకుని సీఐ దగ్గరకి వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పారు. అయితే తెలుగు అర్థం కాకపోవడంతో డ్రైవర్ నహీద్ కాస్త ఆలస్యంగా స్పందించాడు. ఇక లారీ డ్రైవర్ రికార్డులు తీసుకుని లేటుగా లారీ దిగడంతో సీఐకు కోపం వచ్చింది. దీంతో కానిస్టేబుళ్లు ఇద్దరూ డ్రైవర్ నహీద్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ సీఐ ఎదుటే చితక్కొట్టారు. అయితే ఇదే సమయంలో సత్యసాయి జిల్లా కదిరి నుంచి తమిళనాడులోని ఈరోడ్ పేపర్ మిల్లుకు వెళ్తున్న కలప లారీ అక్కడ ఆగింది. ఆ లారీ డ్రైవర్లు.. నహీద్‌ను కానిస్టేబుళ్లు ఇద్దరూ కర్రలతో విచక్షణారహితంగా కొట్టడం చూసిస్పందించారు. సీఐని ప్రాధేయపడి నహీద్ మొహంపై నీళ్లు చల్లి కూర్చోబెట్టాడు. అర్ధరాత్రి కావడంతో తెల్లవారే వరకు ఆగి.. లారీ యూనియన్ సభ్యులకు సమాచారం అందించారు. వారు.. నహీద్‌ను చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఎడమ కాలు విరిగిందని చెప్పారు. నహీద్‌ ఎడమకాలికి సిమెంట్ కట్టు వేసి డిశ్చార్జ్ చేశారు. అయితే, అప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్న సీఐ కళా వెంకటరమణ.. ప్రత్యక్ష సాక్షి మహబూబ్ బాషాతో ఉన్న మరో డ్రైవర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అతడిని కాలర్ పట్టుకుని పోలీస్ జీపు ఎక్కించే ప్రయత్నం చేశారు. సీఐ తీరును ప్రతిఘటించిన లారీ యూనియన్ సభ్యులు.. నహీద్, మహబూబ్ బాషాతో పాటు మరో డ్రైవర్‌ను ఆటోలో ఎక్కించి పంపించారు. సీఐ కళా వెంకటరమణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు చెబుతున్నారు.
Read Entire Article