హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మంత్రి పొన్నం ప్రభాకర్ దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు, ఉపకరణాలను పంపిణీ చేశారు. తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ. 15.12 లక్షల విలువైన 10 మోటారైజ్డ్ స్కూటర్లు, 4 బ్యాటరీ వీల్ చైర్లు, మొబైల్ బిజినెస్ ట్రై సైకిల్, టాబ్లెట్లను 16 మంది లబ్ధిదారులకు అందజేశారు. పదేళ్లుగా ఈ సాయం కోసం ఎదురుచూస్తున్నామని.. ప్రజా పాలన ప్రభుత్వం తమ కలను నెరవేర్చిందని దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాహనాలు తమకు స్వయం ఉపాధి కల్పించడమే కాకుండా.. ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.