ఏపీలో పాఠశాలల అంశంపే శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త విద్యావిధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. సిలబస్‌ను బీజేపీ కాషాయీకరణ చేసిందన్నారు. హిందూ మతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారన్నారు. రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్ మార్పు చేశారనడం సరికాదన్నారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దని.. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మాటలు తప్పుగా ఉంటే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బొత్స సత్యనారాయణ కోరారు. దీన్ని మంత్రి లోకేష్ స్వాగతించారు.